Kedarnath Temple Closing: హిమాలయాల్లో భక్తుల శివనామస్మరణతో మారుమోగే పవిత్ర క్షేత్రం కేదార్‌నాథ్‌లో శీతాకాలం ప్రారంభమైంది. మంచు కొండల మధ్య కొలువైన పరమశివుడి ఆలయ ద్వారాలు ఆరు నెలల పాటు మూతపడ్డాయి. వేదమంత్రాల పఠనం, ఆర్మీ బ్యాండ్ భక్తి గీతాలు, భక్తుల హర హర మహాదేవ్ నినాదాల మధ్య బుధవారం ఉదయం ఆలయ ప్రధాన పూజారులు సంప్రదాయబద్ధంగా తలుపులు మూసివేశారు. ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన హిమాలయ ప్రాంతంలో ఉన్న కేదార్‌నాథ్ ఆలయం శీతాకాలంలో తీవ్రమైన మంచు తుఫానులు, గడ్డకట్టే చలితో భక్తులకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో శీతాకాలం ముగిసే వరకు స్వామివారి ప్రత్యక్ష దర్శనాలను నిలిపివేస్తారు. ఈ సమయంలో భక్తుల పూజల కోసం కేదార్‌నాథ్ ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక ఊరేగింపుగా రుద్రప్రయాగ్ జిల్లాలోని ఉఖీమఠ్‌కు తరలిస్తారు.అక్కడి ఓంకారేశ్వర్ ఆలయంలో వచ్చే ఆరు నెలల పాటు స్వామివారికి నిత్య పూజలు నిర్వహించడంతో పాటు భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. తిరిగి వచ్చే ఏడాది మే నెలలో వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలను తెరవనున్నారు.
ALSO READ: Monsoon Onset | వర్షం పడితే రుతుపవనాలు వచ్చినట్లేనా? ఐఐటీ పరిశోధకుల కొత్త ఆవిష్కరణ
