Bombay High Court: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ E20 ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమంతో తనను, తన కుటుంబాన్ని అక్రమంగా అనుసంధానిస్తూ రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు, AI ఆధారిత తప్పుడు చిత్రాలు, సోషల్ మీడియా పోస్టులను వెంటనే తొలగించాలని మెటా, గూగుల్/యూట్యూబ్‌తో పాటు సంబంధిత డిజిటల్ వేదికలకు ఆదేశించింది. విచారణ సందర్భంగా కోర్టు అభ్యంతరకర కంటెంట్‌ను తీవ్రంగా తప్పుబట్టింది. ముఖ్యంగా యువతకు సులభంగా అందుబాటులో ఉండే సోషల్ మీడియా వేదికల్లో ఇలాంటి తప్పుడు, దుర్వినియోగపూరిత పోస్టులకు స్థానం లేదని స్పష్టం చేసింది.
ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ ట్రాన్స్క్రిప్ట్‌ను పరిశీలించిన అనంతరం ఆ కంటెంట్ అత్యంత అభ్యంతరకరంగా ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌లో నితిన్ గడ్కరీ మెటా, ఎక్స్, గూగుల్/యూట్యూబ్‌తో పాటు కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ విభాగం, గుర్తుతెలియని సోషల్ మీడియా వినియోగదారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఎథనాల్ విధానం ద్వారా తన కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయంటూ వచ్చిన ప్రచారాన్ని, అలాగే తన కుమారుడికి చెందిన సంస్థ ఈ విధానం వల్ల లబ్ధి పొందుతోందన్న ఆరోపణలను గడ్కరీ తీవ్రంగా ఖండించారు.
అయితే, ఈ పిటిషన్ ఉద్దేశం ప్రభుత్వ విధానాలపై న్యాయమైన విమర్శలను అడ్డుకోవడం కాదని, కృత్రిమంగా రూపొందించిన దృశ్యాలు, అసత్య ఆరోపణలు, వ్యక్తిగత పరువుకు భంగం కలిగించే డీప్‌ఫేక్ కంటెంట్‌ను మాత్రమే తొలగించాలని కోరుతున్నట్లు ఆయన కోర్టుకు వివరించారు.
ALSO READ: PV Sindhu | పీవీ సింధు కల సాకారం.. ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీకి నాంది








