LIVE
Thursday, November 12, 2026
LIVE
LIVE

India’s Cleanest City 2026 | ఎనిమిదేళ్ల ఇండోర్ ఆధిపత్యానికి బ్రేక్.. దేశంలో నంబర్ వన్ క్లీన్ సిటీగా నవీ ముంబై

by Bajaswamy
3 views
India's Cleanest City 2026 Navi Mumbai

India’s Cleanest City 2026: పరిశుభ్రతలో దేశవ్యాప్తంగా నగరాల మధ్య జరిగిన పోటీలో ఈసారి కొత్త నగరం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఎనిమిదేళ్లుగా మొదటి స్థానంలో కొనసాగిన ఇండోర్ ఆధిపత్యానికి తెరపడగా.. మహారాష్ట్రకు చెందిన నవీ ముంబై దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 ఫలితాల్లో నవీ ముంబై మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. గుజరాత్‌లోని సూరత్ రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ మూడో స్థానాన్ని సాధించి రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చింది. మరోవైపు, 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల విభాగంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని అగ్రస్థానంలో నిలిచింది. చండీగఢ్ రెండో స్థానంలో ఉండగా.. గుంటూరు మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో గ్రేటర్ విశాఖపట్నం పరిశుభ్రతలో ముందంజ వేసింది. ఈ విభాగంలో జబల్‌పూర్ రెండో స్థానంలో, లక్నో మూడో స్థానంలో నిలిచాయి. గత ఎనిమిదేళ్లుగా వరుసగా అగ్రస్థానంలో ఉన్న ఇండోర్‌కు ఈసారి ప్రధాన జాబితాలో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక నదీ తీర ప్రాంత నగరాల విభాగంలో మధ్యప్రదేశ్‌లోని రేవా మొదటి స్థానాన్ని సాధించగా.. బిలాస్‌పూర్, వారణాసి తర్వాతి స్థానాల్లో నిలిచాయి. స్వచ్ఛ తీర ప్రాంత పట్టణాల కేటగిరీలో ఒడిశాలోని పూరీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అలప్పుజ రెండో స్థానంలో, రత్నగిరి మూడో స్థానంలో నిలిచాయి. హిమాలయ ప్రాంత నగరాల విభాగంలో రుద్రాపూర్ మొదటి స్థానంలో, జమ్మూ రెండో స్థానంలో నిలిచాయి. మెంటర్ సిటీ కేటగిరీలో అహ్మదాబాద్ అగ్రస్థానాన్ని సాధించగా.. ఇండోర్ రెండో స్థానంలో, తిరుపతి మూడో స్థానంలో నిలిచాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నగరాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. మొత్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 ఫలితాలు నగరాల పరిశుభ్రతలో పోటీని మరోసారి చాటిచెప్పాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి నగరాలు సాధించిన గుర్తింపు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More