Gig workers rally: హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ రాజకీయంగానే కాకుండా భావోద్వేగంగానూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని గిగ్ వర్కర్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఓ మహిళా గిగ్ వర్కర్ స్కూటీపై ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. హైటెక్స్ సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు భారీ బైక్ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన లలిత స్కూటీపై రాహుల్ గాంధీ ప్రయాణించారు. తన స్కూటీపై రాహుల్ గాంధీ ప్రయాణించడం జీవితంలో మర్చిపోలేని అనుభవమని లలిత ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ తనతో ఆప్యాయంగా మాట్లాడారని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారని ఆమె వెల్లడించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను హాస్టల్‌లో ఉంటూ రాపిడో నడిపి అదనపు ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు మరింత భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని అభిప్రాయపడ్డారు. ర్యాలీ ముగిసిన అనంతరం రాహుల్ గాంధీ జయభేరి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. మొత్తానికి, ఓ సాధారణ గిగ్ వర్కర్ స్కూటీపై రాహుల్ ప్రయాణించడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు లలితకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మిగిలింది.
