Giribabu Passes Away: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదకర అధ్యాయం ముగిసింది. ఎన్నో దశాబ్దాల పాటు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించి, తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు గిరిబాబు ఇక లేరు. 80 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారన్న వార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గిరిబాబు హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1946 జూన్ 8న ఉమ్మడి ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించారు. నాటకాలపై ఆసక్తితో కళారంగంలోకి అడుగుపెట్టిన ఆయన, 1973లో విడుదలైన ‘జగమే మాయ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలినాళ్లలో హీరోగా నటించిన గిరిబాబు.. ఆ తర్వాత విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్నమైన పాత్రలు పోషించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 600కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, మోహన్ బాబు వంటి అగ్ర నటులతో కలిసి పనిచేశారు.
1977లో వచ్చిన ‘కురుక్షేత్రం’ చిత్రంలో దుశ్శాసనుడిగా ఆయన ప్రదర్శించిన నటన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘జ్యోతి’, ‘పసివాడి ప్రాణం’, ‘హలో బ్రదర్’, ‘సిసింద్రి’, ‘లిటిల్ సోల్జర్స్’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘నువ్వే కావాలి’ వంటి చిత్రాలు ఆయన సినీ ప్రయాణంలో గుర్తుండిపోయే సినిమాలుగా నిలిచాయి. కొత్త తరం హీరోల సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. మహేశ్ బాబు నటించిన ‘అతడు’లో హీరోయిన్ తండ్రి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘గమ్యం’, ‘అ ఆ’, ‘గీత గోవిందం’, ‘డిస్కో రాజా’, ‘జాతిరత్నాలు’ వంటి సినిమాల్లోనూ నటించి మెప్పించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా గిరిబాబు తన ప్రతిభను చాటుకున్నారు. ‘రణరంగం’, ‘ఇంద్రజిత్’, ‘నీ సుఖమే నే కోరుతున్నా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పలు సినిమాలను నిర్మించారు.
గిరిబాబుకు ముగ్గురు సంతానం. ఆయన పెద్ద కుమారుడు రఘుబాబు తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య శ్రీదేవి 2018లో కన్నుమూశారు. తన నటనతో ఎన్నో తరాల ప్రేక్షకులను అలరించిన గిరిబాబు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన పోషించిన పాత్రలు, సినిమాలకు అందించిన సేవలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది సినీ లోకం.
