Kolkata Knight Riders: ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరో కీలక వ్యాపార ఒప్పందంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రముఖ ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యంలోకి అమెరికాకు చెందిన పెట్టుబడి సంస్థ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏరెస్ మేనేజ్‌మెంట్ ఈ ఫ్రాంచైజీలో మైనారిటీ వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం కేకేఆర్ యాజమాన్యం నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, నటి జూహీ చావ్లా, వ్యాపారవేత్త జే మెహతాకు చెందిన మెహతా గ్రూప్ ఈ ఫ్రాంచైజీలో భాగస్వాములుగా ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం, మెహతా గ్రూప్ తనకున్న వాటాలో కొంత భాగాన్ని విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమ వాటాలో సుమారు 20 శాతం మేర విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనలో కేకేఆర్ మొత్తం మార్కెట్ విలువను సుమారు 1.8 బిలియన్ డాలర్లుగా అంచనా వేసినట్లు సమాచారం. అయితే ఇది ప్రస్తుతానికి ప్రతిపాదిత విలువ మాత్రమే. తుది ధరపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఏరెస్ మేనేజ్‌మెంట్ సంస్థ మెహతా గ్రూప్ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఒప్పందం ఖరారైతే కేకేఆర్‌లో కొత్త పెట్టుబడిదారుడి ప్రవేశం ఖాయమవుతుంది. అయితే షారుఖ్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ వాటాలో మార్పు ఉండకపోవచ్చని సమాచారం.
ప్రస్తుతం నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 55 శాతం, మెహతా గ్రూప్‌కు 45 శాతం వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వాటాల్లో కొంత విక్రయం జరిగితే యాజమాన్య నిర్మాణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీల వాటాల విక్రయానికి సంబంధించిన పరిణామాలు కూడా ఐపీఎల్‌లో పెట్టుబడులపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని పెంచాయి. ఈ పరిస్థితుల్లో కేకేఆర్ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తానికి.. ఏరెస్ మేనేజ్‌మెంట్‌తో చర్చలు ఒప్పందంగా మారుతాయా? మెహతా గ్రూప్ ఎంత వాటాను విక్రయిస్తుంది? కేకేఆర్ యాజమాన్యంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ డీల్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు.
ALSO READ: Telangana IPS Transfers 2026 | హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్
