Rahul Gandhi: దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న డెలివరీ సిబ్బంది సమస్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. వారి కష్టాలకు గుర్తింపు, ఉద్యోగ భద్రత, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల ర్యాలీ అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కార్మికులకు భరోసా ఇచ్చారు. గిగ్ వర్కర్ల శ్రమ, బాధలు తనకు తెలుసని పేర్కొన్న రాహుల్.. వారి సంక్షేమానికి అండగా ఉంటామని గతంలో ఇచ్చిన హామీని తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో గిగ్ వర్కర్లకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో లేదని, ఒక్కో డెలివరీకి ఎంత సమయం పడుతోంది, ఎంత ఆదాయం వస్తోంది అనే వివరాలు కూడా కార్మికులకు తెలియని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేందుకు చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రతి డెలివరీకి సంబంధించిన ఆదాయ వివరాలు కార్మికులకు తెలియజేసే విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఎండలోనూ, వానలోనూ విధులు నిర్వహించే డెలివరీ సిబ్బందికి విశ్రాంతి కల్పించేందుకు హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో రెస్ట్ హౌస్‌లు నిర్మించినట్లు వెల్లడించారు. అలాగే గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల ప్రమాద బీమా వంటి భద్రతా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్‌తో పాటు ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి డెలివరీ, రవాణా లావాదేవీపై ఒక శాతం మొత్తాన్ని గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి జమ చేసే విధానం ద్వారా వారికి ఆర్థిక భద్రత కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు, వాటా కల్పించడమే కాంగ్రెస్ సిద్ధాంతమని అన్నారు. గిగ్ వర్కర్లు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొంటూ, వారి పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్యం, భవిష్యత్తు భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.చివరగా, గిగ్ వర్కర్లు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, వారి హక్కులు, సంక్షేమం కోసం కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. జై హింద్.. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
