CM Revanth Reddy: కోర్టు విచారణలకు హాజరవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గతంలో ఆయనపై నమోదైన కేసుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కరోనా సమయంలో ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు(Nampally Court)కు హాజరయ్యారు. 2021లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఏప్రిల్ 11న పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, ఆ సమయంలో ప్రభుత్వం విధించిన కరోనా ఆంక్షలను ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు.. వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కోర్టుకు చేరుకుని న్యాయవాదులతో కొద్దిసేపు చర్చించారు. అనంతరం విచారణ వాయిదా పడటంతో తన హాజరును నమోదు చేయించుకుని తిరిగి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ, తనపై నమోదైన కేసులకు సంబంధించి న్యాయస్థానాల ఆదేశాలను పాటిస్తూ రేవంత్ రెడ్డి విచారణలకు హాజరవుతున్నారు. ఈ కేసు తదుపరి విచారణపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
ALSO READ: Narendra Modi Media Speech | జర్నలిస్టులకు అసాధ్యమంటూ ఏదీ లేదు.. మీడియాను కొనియాడిన మోడీ
