Monsoon Onset: వర్షం మొదలైందంటే రుతుపవనాలు వచ్చేసినట్టేనా? అసలు ఒక ప్రాంతంలో కురిసే సాధారణ వర్షాలకు, దేశవ్యాప్తంగా విస్తరించే నైరుతి రుతుపవనాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ రెండింటినీ కచ్చితంగా గుర్తించేందుకు భారతీయ పరిశోధకులు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఐఐటీ మద్రాస్, గౌహతి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సంయుక్తంగా రూపొందించిన ఈ విధానం ద్వారా స్థానికంగా కురిసే వర్షాలను, రుతుపవనాల అసలైన ఆగమనాన్ని వేరు చేసి గుర్తించవచ్చు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాలను ఒక నెట్‌వర్క్‌లోని కేంద్రాలుగా పరిగణించి.. ఆయా ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యే సమయాల మధ్య సంబంధాలను విశ్లేషించారు.
గత 84 ఏళ్ల వర్షపాత గణాంకాలను పరిశీలించిన పరిశోధకులు కీలక విషయాలను గుర్తించారు. ఈశాన్య భారతదేశంలో సాధారణంగా మే 15 ప్రాంతంలో, ద్వీపకల్ప భారతదేశంలో జూన్ 9 ప్రాంతంలో విస్తృత స్థాయిలో రుతుపవనాల ప్రభావం కనిపిస్తున్నట్లు వెల్లడించారు. కేరళలో తొలుత స్థానిక వర్షాలతో చిన్న వర్షపాత సమూహం ఏర్పడుతుందని వివరించారు. ఈ పరిశోధన వివరాలు మెటియోరలాజికల్ సొసైటీకి చెందిన ‘క్లైమేట్ నెట్‌వర్క్ అప్రోచ్’లో ప్రచురితమయ్యాయి. అయితే, రుతుపవనాల రాకను ప్రకటించే ప్రస్తుత విధానానికి ఇది ప్రత్యామ్నాయం కాదని, అదనపు సహాయక సాధనంగా ఉపయోగపడుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ సాంకేతికతతో రైతులు విత్తనాలు వేసే సమయాన్ని నిర్ణయించుకోవడంతో పాటు ప్రభుత్వాలు నీటి నిల్వలు, ఆహార భద్రత, వరదల ముప్పు వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Assam Train Accident | అస్సాంలో రైలు బీభత్సం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్
