India U19 Asia Cup 2026: యువ క్రికెట్‌లో మరోసారి భారత జట్టు తన సత్తా చాటింది. కీలకమైన సెమీఫైనల్ పోరులో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అద్భుత ప్రదర్శనతో విజయం అందుకుంది. దీంతో ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్ 2026లో టీమిండియా ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. ఒమన్‌లోని అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా గురువారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్‌లో భారత యువ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 227 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి భారీ స్కోరు సాధించకుండా అడ్డుకున్నారు.
228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని, ఆర్యవీర్ సెహ్వాగ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆఫ్ఘన్ బౌలర్లకు వికెట్ దక్కకుండా తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు. సెహ్వాగ్ అర్ధశతకంతో రాణించగా, కెప్టెన్ రాయ్‌చందాని దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. సెహ్వాగ్ పెవిలియన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన వీకే వినీత్ కూడా అద్భుతంగా ఆడాడు. కెప్టెన్ రాయ్‌చందాని సెంచరీకి చేరువలో ఔటైనా, వినీత్ మాత్రం తన జోరును కొనసాగిస్తూ అర్ధశతకం పూర్తి చేశాడు. నూర్ అలీ నియాజీ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది భారత విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో భారత్ 36.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. మొత్తానికి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన భారత యువ జట్టు ఫైనల్‌కు చేరి టైటిల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పుడు అందరి దృష్టి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరగనున్న తుది పోరుపైనే ఉంది. ఆసియా కప్ విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి!
ALSO READ: Station Ghanpur Car Fire | నడిరోడ్డుపై కారులో మంటలు.. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
