Free WiFi Telangana RTC: బస్సు కోసం ఎదురుచూస్తూ ఫోన్‌లో ఇంటర్నెట్ ఉపయోగించాలంటే ఇకపై మొబైల్ డేటా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా తెలంగాణ ఆర్టీసీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్ స్టేషన్లలో మౌలిక వసతులను పెంచడంపై సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 5 వేల మందికి పైగా ప్రయాణికులు వచ్చే 86 బస్ స్టేషన్లను ఇందుకోసం ఎంపిక చేసింది. వీటిలో విడతలవారీగా ఉచిత వైఫై సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే గుర్తించిన స్టేషన్లలో ఒక్కో కంట్రోలర్‌ను నియమించింది. బస్సుల రాకపోకలు, ప్రయాణ సమయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో కొత్త టైమ్‌టేబుల్ బోర్డులను ఏర్పాటు చేయనుంది. మరోవైపు ప్రయాణికుల భద్రత విషయంలోనూ ఆర్టీసీ కీలక అడుగు వేస్తోంది. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని ప్రాంతీయ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయానికి అనుసంధానించనుంది. తద్వారా బస్ స్టేషన్లలో రద్దీ, భద్రతా పరిస్థితులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు బస్ స్టేషన్లలో సౌకర్యాలను ఆధునికీకరించడమే తమ లక్ష్యమని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ALSO READ: Kedarnath Temple Closing | హర హర మహాదేవ్ నినాదాల మధ్య కేదార్నాథ్ ద్వారాలు బంద్
