Kavitha: నిజామాబాద్ గడ్డపై రాజకీయంగా కొత్త అడుగు వేసిన కవిత.. భావోద్వేగానికి గురయ్యారు. తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను నిప్పులాంటి మనిషినని చెప్పిన ఆమె.. సుప్రీంకోర్టు తీర్పుతో తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం దొరికిందని వ్యాఖ్యానించారు. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి నిజామాబాద్‌లో నిర్వహించిన సభలో కవిత ప్రసంగించారు. రాజకీయంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని, కానీ ఒక బిడ్డను తీహార్ జైలుకు పంపడం ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని అప్పట్లో పెద్ద నాయకులే చెప్పారని గుర్తుచేశారు. ఆ తర్వాత అదే పార్టీ నుంచి తనను బయటకు పంపడంపై ప్రశ్నలు సంధించారు.
‘‘నాతో ఎందుకు ఇలా చేయాలి?’’ అంటూ కన్నీటి పర్యంతమైన కవిత.. తన కన్నీళ్లను బలహీనతగా చూడొద్దన్నారు. అవి బాధ, ఆవేశంతో వచ్చినవేనని స్పష్టం చేశారు. ఆమె భావోద్వేగానికి సభలోని పలువురు మహిళలు కూడా కంటతడి పెట్టుకున్నారు. కార్యకర్తలు ‘‘కవిత సీఎం’’ అంటూ నినాదాలు చేశారు. ఆర్నెల్లు జైలులో ఉండి తిరిగి వచ్చినప్పుడు పుట్టినిల్లు తనను ఆదరించలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అత్తమామలు తనకు అండగా నిలిచి కన్నబిడ్డలా చూసుకున్నారని తెలిపారు. తనను జైలుకు పంపిన వారికి ఎన్నికల్లో ప్రజల తీర్పుతో సమాధానం చెబుతానన్నారు. తెలంగాణలో ఇంకా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కొత్త రాజకీయ శక్తి అవసరమని కవిత పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాద్‌లో ఒక్క ఎకరానికైనా నీరు వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై అధికారులను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
ALSO READ: Harish Rao | వెలిగొండ నుంచి నీటి తరలింపు.. తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న హరీశ్‌రావు
