Veligonda Project: కృష్ణా జలాల అంశం మరోసారి తెలంగాణలో రాజకీయ వేడిని పెంచుతోంది. ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను బేసిన్ పరిధిని దాటి తరలిస్తోందని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారంపై మౌనం వహించడం రాష్ట్రానికి నష్టమని ఆయన విమర్శించారు. తెలంగాణలో సాగునీటి పరిస్థితులు క్లిష్టంగా మారుతున్న సమయంలో.. కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని హరీశ్‌రావు అన్నారు. కృష్ణా బేసిన్‌లోని బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడుతుంటే.. బేసిన్‌కు వెలుపల ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించడం ఏమిటని ప్రశ్నించారు.
గతంలో మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్ కుడి కాల్వ అంశాలను ప్రస్తావించిన హరీశ్‌రావు.. ఇప్పుడు వెలిగొండ ద్వారా కూడా తెలంగాణ వాటా జలాలకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి దక్కాల్సిన నీటిని తెలంగాణ ప్రాజెక్టులు, ఆయకట్టుకు మళ్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణను పర్యవేక్షించాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) కూడా ఈ వ్యవహారంలో సమర్థంగా స్పందించడం లేదని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే స్పందించి KRMBపై ఒత్తిడి తీసుకురావాలని, తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్ తరఫున హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
