Amit Shah: పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యపై రాజకీయ వేడి పెరుగుతోంది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనను ప్రధాన అజెండాగా తీసుకున్న బీజేపీ ‘నషా ముక్త్ పంజాబ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జలంధర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని కీలక హామీ ఇచ్చారు. పంజాబ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే 2029 డిసెంబర్ 31లోపు రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని అమిత్ షా ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన డ్రగ్స్ విక్రయాలను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులు, పరిశ్రమలు, వ్యవసాయం, శాంతిభద్రతలు, మహిళల భద్రత వంటి అనేక సమస్యలు పంజాబ్‌ను వేధిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటికే కేంద్రం దేశవ్యాప్తంగా డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటోందని షా తెలిపారు. 2004 నుంచి 2014 మధ్య 26 లక్షల కిలోల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోగా 2014 నుంచి 2026 మధ్య 1.19 కోట్ల కిలోలకు పైగా డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వాటి అంచనా విలువ వరుసగా రూ.40 వేల కోట్లు, రూ.1.89 లక్షల కోట్లుగా పేర్కొంది. దేశవ్యాప్తంగా 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్రం మూడు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. మొత్తంగా చూస్తే పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యను ఎన్నికల ప్రధాన అంశంగా బీజేపీ ముందుకు తీసుకెళ్తుండగా దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందన, తదుపరి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
ALSO READ: Gabbar Singh Ramesh | ఆపదలో ‘గబ్బర్ సింగ్’ నటుడికి చేయూత.. శ్రీమాన్ మంచి మనసు
