Andes hantavirus: మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే అరుదైన హంటావైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఎంవీ హోండియస్ (MV Hondius) క్రూయిజ్ షిప్‌లో గుర్తించిన ఆండీస్ వైరస్ (Andes virus strain) కారణంగా ముగ్గురు మరణించడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కీలక ప్రకటన చేసింది. అయితే, ఈ వైరస్ వల్ల ప్రపంచస్థాయిలో పెద్ద ముప్పు లేదని WHO స్పష్టం చేసింది.
హంటావైరస్‌లు సాధారణంగా ఎలుకల మలమూత్రాల ద్వారా వ్యాపిస్తాయి. కానీ ఆండీస్ వైరస్‌కు ప్రత్యేక లక్షణం ఏమిటంటే, ఇది అత్యంత దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం కలిగి ఉండటం.
ఇప్పటివరకు ఈ క్రూయిజ్ షిప్‌కు సంబంధించిన మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు మరణించగా, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ తెలిపిన వివరాల ప్రకారం, వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత లక్షణాలు బయటపడటానికి ఆరు వారాల వరకు సమయం పట్టవచ్చు. అందువల్ల మరికొన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రస్తుతం ఈ నౌక కానరీ ఐలాండ్స్ వైపు ప్రయాణిస్తోంది. అక్కడ ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని స్వదేశాలకు పంపించనున్నారు.
మొదటి కేసు ఏప్రిల్ 6న గుర్తించబడింది. మొదట ఇది సాధారణ శ్వాసకోశ వ్యాధిగా భావించినప్పటికీ, తర్వాత ఆండీస్ వైరస్‌గా నిర్ధారించారు. బాధితులు షిప్ ఎక్కే ముందు అర్జెంటీనా, చిలీ వంటి దేశాల్లో పర్యటించిన సమయంలో వైరస్ బారినపడి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఇది కోవిడ్ తరహా మహమ్మారి కాదని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని WHO భరోసా ఇచ్చింది.
