Fee Reimbursement: తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల దరఖాస్తు విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై విద్యార్థులు ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతి మెమోలో ఉన్న పేరు, ఇంటిపేరు ఆధార్ కార్డులోని వివరాలతో పూర్తిగా సరిపోవాలి. చిన్న తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. దరఖాస్తు సమయంలో విద్యార్థులు పదో తరగతి హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఉత్తీర్ణత సంవత్సరం వంటి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ఆధార్‌లోని పేరు, మెమోలోని పేరు సరిపోలినపుడే దరఖాస్తు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది.
మొదటి దశ పూర్తైన తర్వాత విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. అనంతరం మీ సేవ కేంద్రాల్లో ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేసి, మిగతా వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఇదే విధానం పునరుద్ధరణ దరఖాస్తులకు కూడా వర్తించనుంది.
ఇకపై ఎస్సీ విద్యార్థులతో పాటు ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజులు, ఉపకార వేతనాలు నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటుండగా, ప్రభుత్వం సుమారు రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది.
అధికారుల అంచనాల ప్రకారం దాదాపు 20 శాతం మంది విద్యార్థులు తమ ఆధార్ వివరాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆధార్-మొబైల్, ఆధార్-బ్యాంక్ ఖాతా అనుసంధానం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Fee Reimbursement | తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. స్కాలర్‌షిప్ కోసం కొత్త వెరిఫికేషన్ సిస్టమ్
-








