TGSRTC: కొత్త వ్యాపారం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న యువ పారిశ్రామికవేత్తలకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న వాణిజ్య దుకాణాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. చిన్న వ్యాపారాల నుంచి మధ్య తరహా వ్యాపారాల వరకు విస్తరించాలనుకునే వారికి ఈ నిర్ణయం ఉపయోగకరంగా మారనుంది.
టీజీఎస్‌ఆర్టీసీ వెల్లడించిన వివరాల ప్రకారం, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బస్టాండ్లు, డిపోలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో మొత్తం 694 షాపులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వీటిని పారదర్శక విధానంలో లీజుకు కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం మొత్తం సంస్థ అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
ఈ వాణిజ్య స్థలాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ షోరూమ్‌లు, మొబైల్ స్టోర్లు, రిటైల్ ఔట్‌లెట్లు వంటి అనేక రకాల వ్యాపారాలను నిర్వహించే అవకాశం ఉంటుంది. రోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఈ షాపులు ఉండటం వ్యాపారాభివృద్ధికి అనుకూలంగా మారనుంది.
కేటాయింపు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి దరఖాస్తుదారుడికి సమాన అవకాశం లభించనుంది. షాపుల పరిమాణం, లీజు వ్యవధి, అద్దె వివరాలు, ప్రదేశ సమాచారం వంటి అన్ని అంశాలను డిజిటల్ విధానంలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సంస్థకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని టీజీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగంలో ముందుకు రావాలని సంస్థ ఎండీ నాగిరెడ్డి సూచించారు.








