CM Vijay: తమిళనాడు రాజకీయ వేదికపై ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రసంగం అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీసింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన, తన పార్టీ భావజాలం, పాలనా దృక్పథం, భవిష్యత్తు ప్రణాళికలను విస్తృతంగా వివరించారు. ద్రావిడ రాజకీయాల మూల స్తంభంగా భావించే పెరియార్ ఈవీ రామసామి సిద్ధాంతాలపై తన వైఖరిని విజయ్ స్పష్టం చేశారు.
పెరియార్ సూచించిన సామాజిక సమానత్వ సూత్రాలను తమ ప్రభుత్వం పూర్తిగా అంగీకరిస్తుందని, అయితే ఆయన నాస్తిక భావజాలం మరియు మత నిరాకరణ సిద్ధాంతాలను మాత్రం అనుసరించబోమని తెలిపారు. తమ పార్టీ దైవ విశ్వాసాన్ని గౌరవిస్తుందని, ఏ సిద్ధాంతానికీ వ్యతిరేకంగా పనిచేయదని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ ఆలోచన ఒకే వ్యక్తి సిద్ధాంతాలపై ఆధారపడలేదని విజయ్ తెలిపారు. అంబేద్కర్ ఇచ్చిన సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అలాగే మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ చూపిన నిజాయితీ పాలన నమూనాను కలిపి తమ విధానాలు రూపొందించుకున్నామని వివరించారు. తమ రాజకీయ ప్రయాణంపై విమర్శలు చేసే వారికి ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. పార్టీని ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లి, వారి సమస్యలను తెలుసుకున్న తర్వాతే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టామని, ఇది సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన మార్గమని చెప్పారు.
2026 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 35 శాతం ఓట్లు, 1.72 కోట్ల ఓట్లు సాధించడం తమకు ప్రజలు ఇచ్చిన స్పష్టమైన మద్దతని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం కుల, మత అడ్డుగోడలను దాటిన ప్రజా తీర్పుగా అభివర్ణించారు. తమ పాలనను అన్నాదురై, ఎంజీఆర్ ప్రభుత్వాల స్ఫూర్తితో, సామాన్య ప్రజల ప్రభుత్వంగా కొనసాగిస్తున్నామని అన్నారు.
అయితే ప్రత్యర్థులు రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని, కరూర్ ఘటనను కూడా తమపై మోపడం సరైంది కాదని విజయ్ విమర్శించారు. గత డీఎంకే పాలనపై ఆయన అవినీతి ఆరోపణలు చేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ వ్యాఖ్యలకు నిరసనగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. లెఫ్ట్ పార్టీలపై స్పందిస్తూ, అవి తమ కూటమిలోకి స్వచ్ఛందంగానే వచ్చాయని, కొన్ని వ్యాఖ్యలు మాత్రం అర్థం కావడం లేదని విజయ్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.








