బీహార్ రాష్ట్రాన్ని అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం నాటికి ఇప్పటివరకు 80 మంది ప్రాణాలు కోల్పోయినట్టు రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ మండల్ తెలిపారు. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలు, పిడుగులు జనజీవనాన్ని నాశనం చేశాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.
మంత్రి విజయ్ కుమార్ మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అన్ని విభాగాల ద్వారా సహాయక చర్యలు చేపట్టిందన్నారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇక రాష్ట్రీయ జనతాదళ్ నేత, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, బీహార్‌లో అకాల వర్షాల బీభత్సం తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధితులకు తగిన పరిహారం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు.
తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, గోదాముల్లో దాచిన గోదుమ పంటలు పూర్తిగా నాశనం కావడం బాధాకరమన్నారు. రైతులకు భరోసా కలిగించే విధంగా నష్టపరిహారం ఇవ్వాలని, ప్రభుత్వ సహాయం తక్షణమే అందాలని డిమాండ్ చేశారు. పంటలపై ఆధారపడే రైతుల జీవనం దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.