ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటన తర్వాత అధికారులు కీలక చర్యలు ప్రారంభించారు. అలీగంజ్ ప్రాంతంలో ఉన్న మూడు అంతస్తుల కోచింగ్ సెంటర్ భవనాన్ని కూల్చివేయాలని(Demolition Notice) లక్నో డెవలప్మెంట్ అథారిటీ (LDA) ఆదేశాలు జారీ చేసింది. ఈ దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు సజీవదహనమైన విషయం తెలిసిందే.
ప్రాథమిక పరిశీలనలో ఆ భవనాన్ని నివాస అవసరాల కోసం అనుమతి తీసుకున్నప్పటికీ, అక్కడ వాణిజ్య ప్రయోజనాల కోసం కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. భద్రతా నిబంధనలను పట్టించుకోకుండా భారీ సంఖ్యలో విద్యార్థులు అక్కడ చేరడం ప్రమాద తీవ్రతను పెంచినట్లు తెలుస్తోంది. గతంలో 2016లోనే ఈ భవనంపై అక్రమ నిర్మాణం కారణంగా కూల్చివేత నోటీసులు జారీ అయినప్పటికీ, తర్వాత అవి ఉపసంహరించబడినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది.
తాజాగా LDA వైస్ చైర్మన్ ప్రథమేశ్ కుమార్ భవనాన్ని కూల్చివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఘటన స్థలాన్ని పరిశీలిస్తోంది. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించి, అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.








