TG Intermediate Board: తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం స్వతంత్రంగా పనిచేస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (BIETS)ను రద్దు చేసి, దానిని పాఠశాల విద్యా బోర్డులో విలీనం చేసే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రస్తుతం విదేశాల్లో 12వ తరగతి వరకు విద్యను ఒకే “స్కూల్ ఎడ్యుకేషన్” వ్యవస్థ కింద నిర్వహిస్తున్నారని, అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తే విద్యార్థులకు సబ్జెక్టులపై మెరుగైన అవగాహన ఏర్పడుతుందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అధికారులను వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఈ మార్పు వెనుక విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 10వ తరగతి తర్వాత విద్యార్థులు కొత్త బోర్డులోకి మారాల్సి వస్తుండటంతో పాఠ్యాంశాలు, పరీక్షా విధానం, పరిపాలనా వ్యవస్థలో మార్పులు ఎదుర్కొంటున్నారు. ఒకే బోర్డు విధానం అమలులోకి వస్తే ఈ సమస్యలు తగ్గే అవకాశముంది. అదే సమయంలో ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలోని కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ప్రత్యేక ఇంటర్ బోర్డులు కొనసాగుతుండగా, చాలా రాష్ట్రాలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకే బోర్డు పరిధిలో విద్యను నిర్వహిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
