LIVE
Sunday, November 15, 2026
LIVE
LIVE

Sridhar Vembu | ఎలాన్ మస్క్‌కు శ్రీధర్ వెంబు కౌంటర్.. భారత్ సత్తా ఇదే!

by Bajaswamy
7 views
Zoho founder Sridhar Vembu

Sridhar Vembu: ప్రపంచ టెక్నాలజీ రంగంలో పోటీ ఇప్పుడు అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ సేవల వరకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) వ్యాఖ్యలు, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పందన టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారతదేశంలో సామాన్యులకు అందుబాటులో ఉన్న డిజిటల్ సేవలను ప్రస్తావిస్తూ వెంబు తన అభిప్రాయాలను వెల్లడించారు. మొబైల్ డేటా, డిజిటల్ చెల్లింపులు, ఔషధాల వంటి రంగాల్లో తక్కువ ఖర్చుతో సేవలు అందుబాటులో ఉండటం భారత్‌కు ప్రత్యేకతగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మొబైల్ ఇంటర్నెట్ ధరలు తగ్గడంలో రిలయన్స్ జియో కీలక పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో పర్యటించే సమయంలో వైఫై కంటే ఫోన్ డేటానే ఎక్కువగా వినియోగిస్తానని, తక్కువ ధరకే అధిక డేటా లభించడం వినియోగదారులకు ప్రయోజనకరమని వివరించారు.

అమెరికా మార్కెట్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి పోటీ అవసరమని వెంబు అభిప్రాయపడ్డారు. చైనా కంపెనీల నుంచి పోటీ పెరిగితే టెస్లా కార్ల ధరలు తగ్గే అవకాశం ఉందనే అంశాన్ని ప్రస్తావించారు. భారత స్టార్టప్‌లు తక్కువ వ్యయంతో రాకెట్లను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతున్నాయని, భవిష్యత్తులో అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ సంస్థలకు పోటీ ఇవ్వగలవని ఆ సత్తా భారతదేశం కి ఉంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల ప్రవేశంపై కొనసాగుతున్న పరిణామాలే ఈ వివాదానికి కారణంగా నిలిచాయి.  దేశంలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలకు అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మస్క్, జియో అధినేత ముకేశ్ అంబానీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసారు. స్టార్‌లింక్(Starlink) మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడంతో పాటు విపత్తుల సమయంలో కమ్యూనికేషన్ సేవలకు ఉపయోగపడుతుందని మస్క్ వాదిస్తున్నారు.

మరోవైపు, ఉపగ్రహ ఇంటర్నెట్ రంగంలోకి ప్రవేశించేందుకు జియో కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మారుమూల గ్రామాలు, ద్వీపాలు, సరిహద్దు ప్రాంతాలకు కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా పలు సంస్థలు ఈ రంగంలో అవకాశాలను పరిశీలిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ మద్దతున్న వన్‌వెబ్ కూడా ఈ మార్కెట్‌లో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. చివరగా చూస్తే చౌకైన ఇంటర్నెట్, మెరుగైన కనెక్టివిటీ, అంతరిక్ష సాంకేతికత.. ఈ మూడు రంగాల్లో పోటీ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పోటీతో వినియోగదారులకు మెరుగైన సేవలు, తక్కువ ధరలు అందుతాయా అన్నది రాబోయే పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

banner
banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More