CM Chandrababu: చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించారు. చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.25 వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 71,636 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చీరాలకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. చేనేత కేవలం ఒక వృత్తి కాదని, అది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. చీరాల చేనేత ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, పట్టు, కాటన్ చీరలకు ఎంతో ఆదరణ ఉందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించిన సీఎం.. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. బీసీల రుణం తప్పకుండా తీర్చుకుంటామని పేర్కొన్నారు. చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు వంటి ప్రాంతాల చేనేత ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని, ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మగ్గాన్నే నమ్ముకుని జీవించే చేనేత కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు కొనసాగిస్తామని సీఎం వెల్లడించారు.
ALSO READ: Vande Mataram Law | వందేమాతరానికి మరింత గౌరవం.. కొత్త చట్టానికి రాష్ట్రపతి ఆమోదం!
