Uttar Pradesh Elections: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. ముఖ్యంగా అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను 209 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ఖరారు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ జాబితాను తుది ఆమోదం కోసం పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో రాష్ట్ర నాయకత్వం జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
కేంద్ర నాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అభ్యర్థులకు ఎన్నికల కార్యాచరణ ప్రారంభించేందుకు అవకాశం కల్పించనున్నారు. చివరి నిమిషంలో హడావుడి లేకుండా ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు, నియోజకవర్గాల్లో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు మహిళా ఓటర్లను ఆకర్షించడంపైనా బీజేపీ ప్రత్యేక దృష్టి సారించే అవకాశముంది. మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తామని సీఎం యోగి ఇటీవల ప్రకటించడం ఈ దిశగా ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి 300కు పైగా స్థానాల్లో విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ముందస్తు ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తోంది. అయితే అభ్యర్థుల ఎంపిక, మహిళా ఓటర్లకు ఇచ్చే హామీలు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.
ALSO READ: Patnam Narender Reddy | అరెస్టులతో బీఆర్ఎస్ను అడ్డుకోలేరు.. పట్నం అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్
