Patnam Narender Reddy: ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాల్సిన నాయకులకే ఆంక్షలు ఎదురవుతున్నాయంటూ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోస్గిలో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త అంత్యక్రియలకు హాజరై, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని విమర్శించారు. కష్టకాలంలో ఉన్న కార్యకర్త కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు వెళ్లే నాయకుడిని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బాధితులకు అండగా నిలవడం కూడా ఇందిరమ్మ రాజ్యంలో నేరంగా మారిందా అంటూ నిలదీశారు.
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. అయితే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు బీఆర్ఎస్ వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం, పార్టీ కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. పట్నం నరేందర్ రెడ్డిని ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
