Voter Registration: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా వివిధ కారణాలతో ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన అర్హులకు మరోసారి నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల ఎన్నికల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. వివిధ కారణాలతో గతంలో ఓటరు నమోదు ఫారాలు తిరిగి వచ్చిన వారిలో అర్హులైన వ్యక్తులను గుర్తించి, వారికి మరో అవకాశం ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందుకోసం అర్హుల జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించాలని సూచించింది. బూత్ లెవల్ అధికారులు (BLO) నేరుగా వారిని సంప్రదించి కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన ఫారాలను అందించాలని స్పష్టం చేసింది.
అంతేకాదు.. ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులను గుర్తించేందుకు వారి చిరునామాల ఆధారంగా ఇంటింటి తనిఖీలు చేపట్టాలని సూచించింది. అవసరమైతే రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్థానికులు, సంబంధిత వ్యక్తుల సహకారం తీసుకోవాలని పేర్కొంది. గుర్తించిన అర్హులకు దరఖాస్తుల సమర్పణ విధానంపై BLOలు అవగాహన కల్పించాలని ఆదేశించింది. ఇక గతంలో ఉన్న చిరునామా నుంచి మరో ప్రాంతానికి మారిన ఓటర్లు తమ ప్రస్తుత నివాస వివరాలతో ఫారం-సి సమర్పించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది. కొత్త చిరునామా, అది ఏ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుందనే వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించింది. మొత్తంగా ఓటర్ల జాబితాలో పేరు కోల్పోయిన అర్హులెవరూ ఓటు హక్కుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ చర్యలు చేపట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును మరోసారి నమోదు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: Karmabhoomi Express Fire Accident | కర్మభూమి ఎక్స్ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలు దగ్ధం
