LIVE
Friday, November 6, 2026
LIVE
LIVE

Karmabhoomi Express Fire Accident | కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలు దగ్ధం

by Bajaswamy
10 views
Karmabhoomi Express Fire Accident

Karmabhoomi Express Fire Accident: పండుగల వేళ రైలు ప్రయాణాలు కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు, దట్టంగా వ్యాపించిన పొగ ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాయి. అయితే అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్ నుంచి బిహార్‌కు వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. పటియాలా జిల్లా రాజ్‌పురా సమీపంలోని సరాయ్ వంజారా గ్రామం వద్ద రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రైలును నిలిపివేయడంతో ప్రయాణికులంతా కిందకు దిగి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.

ఈ ఘటనపై పటియాలా డిప్యూటీ కమిషనర్ హిమాంశు అగర్వాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రైలులోని ప్యాంట్రీ కారులో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. అనంతరం అవి పక్కనే ఉన్న ఇతర బోగీలకు వ్యాపించాయి. మొత్తం ఐదు బోగీలు మంటల బారినపడినట్లు సమాచారం. ఫైర్ అలారం మోగడంతో ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బయటకు వచ్చారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేయడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే.. పండుగల సీజన్‌లో రైళ్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో ఈ ఘటన రైల్వే భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రమాదానికి అసలు కారణమేంటనే దానిపై భారతీయ రైల్వే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ప్రయాణికుల అప్రమత్తత, సిబ్బంది తక్షణ స్పందనతో ప్రాణనష్టం తప్పింది. అయితే రైళ్లలో అగ్నిప్రమాదాల నివారణకు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More