CM Chandrababu Naidu: దేశంలో అవినీతిని అరికట్టడంతో పాటు పేదరికాన్ని నిర్మూలించాలంటే పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్ కరెన్సీ(Digital Currency) వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఈ క్రమంలో మరోసారి పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2,000 నోట్లతో పాటు రూ.500 నోటును కూడా రద్దు చేయాలని చంద్రబాబు సూచించారు. దేశంలో రూ.100, రూ.200 నోట్లు మాత్రమే చలామణిలో ఉండాలని పేర్కొన్నారు. అవినీతిని అరికట్టేందుకు డిజిటల్ కరెన్సీ సమర్థవంతమైన మార్గమని, ఈ ప్రతిపాదనపై ప్రధాని నరేంద్ర మోడీని తాను కోరుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
మరోవైపు, టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకుంటే సంపద సృష్టితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని సీఎం అన్నారు. పేదరిక నిర్మూలనలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఇదిలా ఉండగా, యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్-2026లో ఆంధ్రప్రదేశ్ 0.66 స్కోరుతో దేశంలో రెండో ర్యాంకు సాధించింది. 0.68 స్కోరుతో గోవా మొదటి స్థానంలో నిలిచింది. న్యూ ఎకనామిక్ స్టడీస్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయనంలో విద్య, వైద్యం, తాగునీరు, గృహవసతి, డిజిటల్ సదుపాయాలు, ఉపాధి, బ్యాంకింగ్, బీమా, సామాజిక భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
సామాజిక, ఆర్థిక భద్రత విభాగంలో ఏపీ 0.69 స్కోరు సాధించిందని చంద్రబాబు తెలిపారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం 13వ స్థానంలో ఉన్నప్పటికీ, సమానత్వ సూచీలో మెరుగైన స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఉచిత ఇసుక వంటి విధానాలతో ప్రజలకు రాష్ట్ర వనరుల ప్రయోజనాలు అందిస్తున్నామని చెప్పారు. చివరిగా, ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించడం, పేదరికాన్ని తగ్గించడం, సమాన అవకాశాలు అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సంపద సృష్టించడం మాత్రమే అభివృద్ధి కాదని, ఆ సంపదతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు.
ALSO READ: Uttar Pradesh Elections | యోగి సర్కార్ ఎన్నికల వ్యూహం.. అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచిన బీజేపీ
