Damodara Rajanarasimha: తెలంగాణలో వైద్య సేవల కోసం హైదరాబాద్‌పై ఆధారపడే పరిస్థితికి స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సామాన్యులకు సైతం సొంత జిల్లాల్లోనే మెరుగైన, నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆరోగ్య శాఖలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా జిల్లా స్థాయి ఆసుపత్రులను మరింత ఆధునికంగా తీర్చిదిద్ది, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలను విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ దిశగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల పనితీరును మెరుగుపరచడంతో పాటు వైద్య సేవలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా కొత్త పాలనా విధానాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) కార్యాలయాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించారు. రాష్ట్ర స్థాయి డైరెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల బాధ్యతలు స్పష్టంగా ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో సదుపాయాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రుల్లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వైద్య పరికరాల కొరత, మౌలిక వసతుల లోపాలు, సిబ్బంది ఖాళీలను జిల్లా స్థాయిలోనే గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మరోవైపు వైద్యుల కొరతను అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించే ప్రక్రియ చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. వీరితో పాటు అవసరమైన నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ల నియామకాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తంగా చూస్తే.. హైదరాబాద్‌కే పరిమితమైన మెరుగైన వైద్య సేవలను జిల్లాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రతిపాదిత సంస్కరణలు, సిబ్బంది నియామకాలు కార్యరూపం దాల్చితే సామాన్య ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంది.
ALSO READ: Sarvam AI | గూగుల్ క్లౌడ్ మాజీ బాస్‌కు సర్వమ్ ఏఐలో కీలక బాధ్యతలు
