Sabarimala Portal: అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్లే భక్తులకు ఈసారి ప్రయాణం మరింత సులభం కానుంది. యాత్రలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడంతోపాటు అవసరమైన సమాచారాన్ని వేగంగా అందించేందుకు కేరళ ప్రభుత్వం సరికొత్త డిజిటల్ సేవలను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా శబరి పోర్టల్, వాట్సాప్ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
ఒకే వేదికపై అన్ని సేవలు
మండల-మకరవిళక్కు యాత్రలను దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం ఈ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. దర్శనం, రవాణా, వసతి, వైద్యం, అత్యవసర సేవలకు సంబంధించిన వివరాలను ఒకే వేదికపై పొందవచ్చు. పంబ, నీలక్కల్, సన్నిధానం ప్రాంతాల్లో ఉన్న సౌకర్యాల సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. దీంతో వివిధ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గనుంది.
తప్పిపోయినా.. వస్తువులు పోయినా ఫిర్యాదు చేయొచ్చు
యాత్రలో ఎవరైనా తప్పిపోయినా, వ్యక్తిగత వస్తువులు పోగొట్టుకున్నా శబరి పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ వివరాలు నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరతాయి. అధికారులు చేపట్టిన చర్యల సమాచారాన్ని వాట్సాప్ ద్వారా భక్తులకు అందిస్తారు.
గూగుల్ మ్యాప్స్‌తో సులభంగా ప్రయాణం
తాగునీటి కేంద్రాలు, మరుగుదొడ్లు, వైద్య కేంద్రాలు, పార్కింగ్ స్థలాలు, విశ్రాంతి భవనాలు, ఏటీఎంల వివరాలను పోర్టల్‌లో చూడవచ్చు. గూగుల్ మ్యాప్స్ సాయంతో వాటి వద్దకు చేరుకునే మార్గాన్ని కూడా తెలుసుకోవచ్చు. రైళ్లు, బస్సుల రాకపోకల సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన వస్తువుల అధికారిక ధరలను పలు భాషల్లో తెలుసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. మొత్తంగా శబరిమల యాత్రను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మార్చేందుకు కేరళ ప్రభుత్వం డిజిటల్ పరిష్కారాలపై దృష్టి పెట్టింది. ఈ పోర్టల్, వాట్సాప్ చాట్‌బాట్ అందుబాటులోకి వస్తే లక్షలాది అయ్యప్ప భక్తులకు సమాచారం పొందడం, అత్యవసర సమయంలో సహాయం కోరడం మరింత సులభం కానుంది.
ALSO READ: Summer Holidays Review | చిన్ననాటి రోజులను గుర్తుచేసిన సినిమా.. సమ్మర్ హాలిడేస్ ఎలా ఉందంటే?
