CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుపై సీఎం చంద్రబాబు శుక్రవారం రూ.40 కోట్ల విలువైన 58 అధునాతన అగ్నిమాపక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే ఈ ఆధునికీకరణ లక్ష్యం. కొత్త వాహనాల్లో గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో సేవల కోసం 25 ఫైర్ ఫైటింగ్ వాహనాలు, భారీ అగ్నిప్రమాదాల్లో నీటి సరఫరాకు 14,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 20 వాటర్ బౌజర్లు ఉన్నాయి.
ఇరుకైన, రద్దీ ప్రాంతాలకు త్వరగా చేరుకునేందుకు 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ వాహనాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో వీటిని కొనుగోలు చేశారు. ఫైర్ శాఖ ఆధునికీకరణకు ప్రభుత్వం మూడు దశల్లో రూ.252.86 కోట్ల ప్రణాళిక అమలు చేస్తోంది. తొలి దశలో రూ.33 కోట్లతో 65 వాహనాలు సమకూర్చగా, తాజా కార్యక్రమం రెండో దశలో భాగం. మూడో దశలో మరిన్ని వాహనాలు, అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 కొత్త ఫైర్ స్టేషన్ల నిర్మాణం, 36 పాత స్టేషన్ల ఆధునికీకరణ పనులు కూడా కొనసాగుతున్నాయి.

ALSO READ: National Flag | వేలాది మందితో భారీ తిరంగ మార్చ్.. గిన్నిస్, గోల్డెన్ బుక్లో చోటు
