CII Partnership Summit: ఆంధ్రా ఆతిథ్యంలో ఘాటు ఉంటుంది.. పెట్టుబడుల విషయంలో అంతకుమించిన వేగం ఉంటుంది! ఇదే ఇప్పుడు మంత్రి నారా లోకేశ్ విదేశీ పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన సందేశం. విశాఖపట్నం వేదికగా జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు అంతర్జాతీయ ప్రతినిధులు తరలివస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ వినూత్నంగా వారికి స్వాగతం పలికారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఆసక్తికర పోస్ట్ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను చమత్కారంగా వివరిస్తూ.. ఇక్కడ ‘నాన్ స్పైసీ’ అనేది మెనూలో ఉండే ఆప్షన్ కాదంటూ లోకేశ్ పేర్కొన్నారు. ఆంధ్రా వంటకాల ఘాటు, ప్రత్యేకమైన రుచులను విదేశీ అతిథులకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఇక్కడ భోజనం ఎంత ఘాటుగా ఉంటుందో.. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు కూడా అంతే వేగంగా లభిస్తాయని తన పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చారు. ‘స్పైసీ ఫుడ్.. స్పీడీ అప్రూవల్స్.. ఇదే ఆంధ్ర విధానం’ అంటూ ఆకట్టుకునే నినాదాన్ని జోడించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ సహకారం అందిస్తామనే సంకేతాలను ఈ పోస్ట్ ద్వారా ఇచ్చారు. సంప్రదాయ ఆతిథ్యంతో పాటు వేగవంతమైన పారిశ్రామిక అనుమతులు.. ఈ రెండింటినీ కలిపి ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేలా లోకేశ్ చేసిన ప్రచారం ఆసక్తికరంగా మారింది.

