Free Electricity for Ganesh Mandapams: వినాయక చవితి వేడుకలకు సిద్ధమవుతున్న భక్తులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దీంతో వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులపై పడే విద్యుత్ ఖర్చుల భారం తగ్గనుంది. భాద్రపద శుక్ల పక్ష చతుర్థిని వినాయక చవితిగా జరుపుకోవడం ఆనవాయితీ. తెలుగు పంచాంగం ప్రకారం 2026లో సెప్టెంబర్ 14న వినాయక చవితి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. భారీ మండపాలు, విద్యుత్ అలంకరణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో మండపాలకు ఉచిత విద్యుత్ అందించే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గణేష్ మండపాలకు ఈ సదుపాయం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. దీంతో మండపాల నిర్వహణలో అయ్యే ఖర్చు కొంతమేర తగ్గి నిర్వాహకులకు ఆర్థికంగా ఊరట లభించనుంది. వినాయక చవితి వేడుకలను ప్రజలు మరింత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకోవడానికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, రాష్ట్ర ప్రజలకు శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై గణేష్ ఉత్సవాల నిర్వాహకులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
