LIVE
Saturday, November 14, 2026
LIVE
LIVE

Sudheer Upcoming Movie | చిరంజీవికి ఖైదీలా.. సుధీర్‌కు గోట్‌ మైలురాయిగా నిలుస్తుందా?

by Bajaswamy
12 views
Sudigali Sudheer G.O.A.T

Sudheer Upcoming Movie: చిరంజీవికి ‘ఖైదీ’ ఎలాగైతే కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందో.. సుడిగాలి సుధీర్‌కు ‘గోట్‌’ కూడా అలాంటి గుర్తింపును తీసుకొస్తుందని చిత్ర నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. బుల్లితెరపై తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన సుధీర్‌.. ఇప్పుడు వెండితెరపై మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం G.O.A.T (Greatest Of All Times) నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దివ్యభారతి కథానాయికగా నటించిన ఈ సినిమాకు వేదవ్యాస్‌ దర్శకత్వం వహించారు. మహాతేజ క్రియేషన్స్‌, జైష్ణవ్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించగా.. చంద్రశేఖర్‌ రెడ్డి మొగుళ్ల నిర్మాతగా వ్యవహరించారు. ఏషియన్‌ సినిమాస్‌ సమర్పణలో విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హీరో మంచు మనోజ్‌, నిర్మాత నిరంజన్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. తాను సుడిగాలి సుధీర్‌కు అభిమానినని తెలిపారు. బుల్లితెర నుంచి ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గోట్‌ మంచి విజయాన్ని అందుకోవాలని, సుధీర్‌ మరిన్ని గొప్ప సినిమాల్లో నటించాలని ఆకాంక్షించారు. హీరోయిన్‌ దివ్యభారతి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నానని, తన కెరీర్‌లో ఇది ఎంతో ప్రత్యేకమైన చిత్రమని చెప్పారు. కేవలం వినోదానికే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ సమస్యలను కూడా ఇందులో ప్రస్తావించినట్లు వెల్లడించారు. సినిమా పూర్తిచేయడానికి నిర్మాత చంద్రశేఖర్‌ రెడ్డి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, ఎక్కడా నాణ్యత విషయంలో రాజీపడలేదని ప్రశంసించారు. దర్శకుడు వేదవ్యాస్‌ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ఒక గ్రామంలో ఎవరూ బెట్టింగ్‌కు బానిసలు కాకూడదనే ఆలోచన చుట్టూ ఈ కథ నడుస్తుందని వివరించారు. సమాజానికి అవసరమైన సందేశాన్ని హాస్యం, భావోద్వేగాలు కలగలిపి ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నించామని చెప్పారు.

నిర్మాత చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో సినిమాను పూర్తి చేశానని తెలిపారు. చిరంజీవి కెరీర్‌లో ‘ఖైదీ’ ఎలాంటి ప్రత్యేకతను సంపాదించుకుందో.. సుధీర్‌ ప్రయాణంలో ‘గోట్‌’ కూడా అలాంటి గుర్తింపును తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దివ్యభారతి నటన, మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని అన్నారు. వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే కమర్షియల్‌ చిత్రంగా గోట్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. అలాగే మంచు మనోజ్‌ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదని, ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. గోట్‌ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. చివరిగా హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ.. ఎన్నో ఆటంకాలు, ఒడిదుడుకులను అధిగమించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు. నిర్మాత చంద్రశేఖర్‌ రెడ్డి ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. ప్రేక్షకులు సినిమాను థియేటర్లలో చూసి నచ్చితే మరో పదిమందికి తెలియజేయాలని కోరారు. మరి నిర్మాత చెబుతున్నట్లుగా ‘గోట్‌’ సుధీర్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందో లేదో తెలియాలంటే నవంబర్‌ 12 వరకు వేచి చూడాల్సిందే.

sudigaali sudheer goat movie updates
banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More