LIVE
Thursday, November 12, 2026
LIVE
LIVE

Idupu Kayitham Teaser | ప్రేమ.. పెళ్లి.. చివరకు విడాకులా? ఆసక్తి రేపుతున్న ‘ఇడుపు కాయితం’.. టీజర్‌తో పెరిగిన అంచనాలు

by Bajaswamy
5 views
Idupu Kayitham Teaser

Idupu Kayitham Teaser: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. ఆ తర్వాత సంతోషంగా జీవితాన్ని కొనసాగించాల్సిన సమయంలో విడాకుల పత్రం చేతికి వస్తే? అసలు ఆ బంధంలో ఏం జరిగింది? భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణమేంటి? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది ప్రియదర్శి నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విభిన్నమైన టైటిల్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన నాగదుర్గ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన రామాయణానికి సంబంధించిన మాటలతో టీజర్ ప్రారంభమవుతుంది. కథలో మహిళ పాత్ర ప్రాధాన్యతను సూచించేలా ఈ ప్రారంభ సన్నివేశాన్ని రూపొందించారు. అనంతరం ప్రేమ, పెళ్లి చూపులు, వివాహం, కుటుంబ అనుబంధాలతో కథను సరదాగా పరిచయం చేశారు.

ఇందులో శ్రీను పాత్రలో ప్రియదర్శి, శ్రీలతగా నాగదుర్గ కనిపిస్తున్నారు. వీరిద్దరి పరిచయం నుంచి ప్రేమ వరకు, ఆ తర్వాత పెళ్లి బంధంలోకి అడుగుపెట్టే క్రమాన్ని వినోదాత్మకంగా చూపించారు. పెళ్లి తర్వాత కొత్త జంట జీవితంలో ఎదురయ్యే చిన్నపాటి గొడవలు, అలకలు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే సరదా సంఘటనలు టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. ప్రియదర్శి తనదైన కామెడీ టైమింగ్‌తో సందడి చేయగా, నాగదుర్గ కూడా తన పాత్రతో ఆకట్టుకున్నారు. అయితే ఈ కథలో అసలు ట్విస్ట్ మాత్రం చివర్లోనే బయటపడుతుంది. ఎంతో ప్రేమతో ఒక్కటైన శ్రీను, శ్రీలత చివరకు విడాకుల పత్రం వరకు ఎందుకు వెళ్లారు? వారి మధ్య బంధం బీటలు వారడానికి కారణమేంటి? అనే ప్రశ్నలను ఆసక్తికరంగా తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, సహజమైన సంభాషణలు, కుటుంబ వాతావరణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి.

‘ఇడుపు కాయితం’ అంటే విడాకుల పత్రం. ఈ విభిన్నమైన టైటిల్ వెనుక ఉన్న కథేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పటికే ప్రేక్షకుల్లో మొదలైంది. వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై సుకుమార్, తబితా సుకుమార్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘శ్రీలత’, ‘గడప’, ‘బారాత్ బీట్’ పాటలు మంచి ఆసక్తిని కలిగించాయి. మొత్తానికి ప్రేమ, పెళ్లి, కుటుంబ బంధాలు, భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థలను వినోదంతో మేళవించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఇడుపు కాయితం’ ఉండబోతున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. మరి విడాకుల పత్రం వెనుక దాగిన అసలు కథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

banner
banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More