Punjab Temple Demolition: పాకిస్థాన్‌లో పురాతన హిందూ ఆలయం(Hindu Temple) కూల్చివేత వ్యవహారం ఇప్పుడు వివాదానికి దారితీసింది. తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లోని నరోవల్ జిల్లాలో సిరాజ్ గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి దాదాపు శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. సుమారు వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆలయాన్ని ఆగస్టు 21న కూల్చివేసినట్లు సమాచారం. ఆలయం పక్కనే ఉన్న మదర్సా విస్తరణ కోసం దాని స్థలాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతోనే కట్టడాన్ని నేలమట్టం చేశారని స్థానికులు, మైనారిటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిషేధిత తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని, ఆలయ స్థలాన్ని కాపాడి తిరిగి ఆలయాన్ని నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆలయం తీవ్రంగా దెబ్బతిని, శిథిలావస్థకు చేరుకోవడంతోనే దాన్ని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో స్థానికుల ఆరోపణలకు, ప్రభుత్వ వివరణకు మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటు సమీపంలోని ఆక్రమణలను తొలగించాలని స్థానికులు, మైనారిటీ సంఘాలు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కోరుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజకీయ వర్గాల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి. శతాబ్దం నాటి ప్రార్థనా స్థలం కూల్చివేతపై నెలకొన్న వివాదం.. పాకిస్థాన్‌లో మైనారిటీల ప్రార్థనా స్థలాల రక్షణపై మరోసారి చర్చకు తెరతీసింది.
ALSO READ: ChatGPT Ads | గూగుల్, మెటాకు షాక్.. యాడ్స్ బిజినెస్‌లో OpenAI భారీ అడుగు!
