75 Year Old Woman Rescue: ఒక్క క్షణం జరిగిన ప్రమాదం ఆమెను మృత్యువుకు చేరువ చేసింది.. కానీ ధైర్యం, పట్టుదలతో రెండు రోజుల పాటు ప్రాణాలు నిలుపుకున్న 75 ఏళ్ల వృద్ధురాలు చివరకు సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా చాంద్‌వాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చంద్రభాగ ధులాజీ వార్కటే అనే వృద్ధురాలు ఆగస్టు 29న కొడుకు ఇంటికి వెళ్తుండగా బస్‌స్టాండ్ సమీపంలోని తెరిచి ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడిపోయారు. దాదాపు రెండు రోజుల పాటు ఆహారం, నీరు లేకుండానే బావిలో చిక్కుకుపోయారు. అయితే బావిలోని పైపు, తాడును గట్టిగా పట్టుకుని ధైర్యంగా సమయం గడిపారు.
వృద్ధురాలి పరిస్థితిని గుర్తించిన స్థానిక యువకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చాంద్‌వాడ్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఖాటీ సాయంతో ఆమెను జాగ్రత్తగా పైకి తీసుకొచ్చి, అనంతరం చికిత్స కోసం పింపల్‌గావ్ ఆసుపత్రికి తరలించారు. బావి వద్ద భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయని చెబుతూ.. తెరిచి ఉన్న బావుల చుట్టూ రక్షణ కంచెలు, భద్రతా వలలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు.
ALSO READ: Rashmika Mandanna | యాక్షన్ అవతార్‌లో రష్మిక.. ‘మైసా’ విడుదల తేదీ ఖరారు
