Kyle Jamieson: ఐపీఎల్(IPL 2026) మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కైల్ జేమీసన్ ప్రవర్తనపై వివాదం చెలరేగింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన అనంతరం జేమీసన్ ఆవేశంతో స్పందిస్తూ బ్యాటర్ వైపు దూసుకెళ్లి అరుచుకోవడం చర్చనీయాంశమైంది.ఈ ఘటన జైపూర్‌లో జరిగిన మ్యాచ్ రెండో ఓవర్‌లో చోటుచేసుకుంది.
జేమీసన్ ప్రవర్తనపై ఐపీఎల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతనికి ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇది లెవల్-1 ఉల్లంఘనగా పరిగణించి వార్నింగ్ జారీ చేశారు.
న్యూజిలాండ్‌కు చెందిన ఈ బౌలర్ ఆర్టికల్ 2.5 కింద తప్పు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆర్టికల్ ప్రకారం, అభ్యంతరకరమైన భాష, సంకేతాలు లేదా ప్రత్యర్థిని రెచ్చగొట్టే ప్రవర్తనకు శిక్షలు విధిస్తారు.
వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసిన వెంటనే జేమీసన్ అతని వద్దకు వెళ్లి ఆవేశంగా స్పందించడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వచ్చాయి. మ్యాచ్ రిఫరీ రాజీవ్ సేథ్ విధించిన శిక్షను జేమీసన్ అంగీకరించాడు. ఈ ఘటనతో ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రవర్తనపై మరోసారి చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా, అదే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.








