UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో, భవిష్యత్తులో కొన్ని యూపీఐ లావాదేవీలపై రుసుములు విధించే అవకాశానికి మార్గం ఏర్పడింది. ఈ బిల్లుకు రాజ్యసభ, అనంతరం రాష్ట్రపతి ఆమోదం లభిస్తే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులు పూర్తిగా ఉచితంగా కొనసాగుతున్నాయి. అయితే కొత్త విధానంలో ప్రధానంగా పెద్ద వ్యాపార సంస్థలకు జరిగే యూపీఐ చెల్లింపులపై బ్యాంకులు రుసుములు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఛార్జీలు వినియోగదారులపై కాకుండా చెల్లింపును స్వీకరించే వ్యాపారులకే వర్తించే అవకాశం ఉందని సమాచారం.
ప్రాథమిక వివరాల ప్రకారం రూ.2 వేలకుపైగా జరిగే లావాదేవీలకు మాత్రమే ఈ నిబంధనలు అమలు కావచ్చు. చిన్న వ్యాపారులు, వ్యక్తిగత లావాదేవీలు, పర్సన్-టు-పర్సన్ చెల్లింపులు మాత్రం ఇప్పటిలాగే ఉచితంగా కొనసాగనున్నాయి. గతంలో అమలులో ఉన్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని 2020లో కేంద్రం రద్దు చేసింది. ఇప్పుడు యూపీఐ సేవలను మరింత బలోపేతం చేయడం, సాంకేతిక మౌలిక వసతులను మెరుగుపరచడం లక్ష్యంగా పరిమిత స్థాయిలో రుసుములను తిరిగి అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.








