Chiranjeevi Team: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్త నిజం కాకపోవచ్చు. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ ప్రచారం కూడా అలాంటి కోవలోకే చేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెగాస్టార్ చిరంజీవిని అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని చిరంజీవి బృందం స్పష్టం చేసింది. అధికారిక ధ్రువీకరణ లేని వార్తలను నమ్మవద్దని, నిరాధార సమాచారాన్ని సోషల్ మీడియాలో మరింతగా వ్యాప్తి చేయొద్దని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం చిరంజీవికి బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగించనున్నట్లు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అలాంటి ప్రతిపాదన గానీ, నిర్ణయం గానీ లేదని మెగా టీమ్ అధికారికంగా ఎక్స్ (X) వేదికగా స్పష్టం చేసింది. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలకు తెరపడింది.
ALSO READ: Rammohan Naidu | ఇథనాల్ వేరు.. SAF వేరు.. గందరగోళం వద్దన్న కేంద్ర మంత్రి








