Jabalpur boat tragedy: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో నర్మదా నదిపై ఉన్న బర్గీ జలాశయంలో జరిగిన పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా, అనేక మందిని సురక్షితంగా రక్షించారు. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో పడవ మునిగే ముందు ప్రయాణికులు భయంతో అల్లాడుతున్న క్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బోటులోకి నీరు చేరుతుండటంతో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది.
బోటులో ప్రయాణికులకు ముందుగానే లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం వల్లే ప్రాణనష్టం పెరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రమాద సమయంలో సిబ్బంది జాకెట్లు ఇవ్వడానికి ప్రయత్నించినా ఆలస్యమైందని చెబుతున్నారు.
మరోవైపు, మరీనా అనే మహిళ తన కుమారుడిని ఒడిలో బిగిగా పట్టుకుని మృతదేహంగా బయటపడిన ఘటన అందరినీ కలచివేసింది. ఆమె భర్త మాత్రం ప్రాణాలతో బయటపడడం గమనార్హం.
ప్రమాదం సాయంత్రం జరిగినప్పటికీ, సహాయక చర్యలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే వాహనం దెబ్బతినడం వల్లే ఆలస్యం జరిగిందని అధికారులు వివరణ ఇచ్చారు. స్థానిక మత్స్యకారులు, రైతులు ముందుగా స్పందించి పలువురిని రక్షించగా, అనంతరం అధికార బృందాలు చేరుకున్నాయి.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి క్రూయిజ్, బోట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసి, ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.








