Danam Nagender: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, కుటుంబ వ్యవహారాలపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు.
శనివారం మీడియాతో మాట్లాడుతూ, కవిత తన రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి మరియు కుటుంబ సమస్యలను ప్రజల్లోకి తీసుకురావడం సరికాదని ఆయన హితవు పలికారు. రాజకీయంగా విమర్శలు చేయడం వేరు, కానీ పదే పదే సొంత తండ్రిని లక్ష్యంగా చేసుకోవడం తగదని దానం వ్యాఖ్యానించారు.
“కవిత ఏదైనా కలలు కనవచ్చు కానీ అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మరో పదేళ్లు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాల్సిన కేసీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు మానసికంగా ప్రభావం చూపుతున్నాయని ఆయన విమర్శించారు.
అదే సమయంలో కేసీఆర్‌పై పాజిటివ్ వ్యాఖ్యలు చేస్తూ, ఆయన ఒక మాస్ లీడర్ అని, ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసని దానం నాగేందర్ పేర్కొన్నారు. ఈ విషయంలో అనవసర ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల్లో ఇటీవల ఆందోళన ఎక్కువైందని, అందుకే అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన వారే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. ట్యాపింగ్ చేసిన వారే ఇప్పుడు నీతులు చెప్పడం ఆశ్చర్యకరమని ఎద్దేవా చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవ్వరినీ వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ, ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని దానం నాగేందర్ తెలిపారు.








