JP Nadda Health Update: కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గుండె సంబంధిత సమస్యతో ఆగస్టు 13న ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. నడ్డాకు నిర్వహించిన కొరోనరీ యాంజియోగ్రఫీలో గుండెకు సంబంధించిన సమస్యను గుర్తించిన వైద్యులు ఆగస్టు 17న యాంజియోప్లాస్టీ చేశారు. అనంతరం కార్డియాలజీ విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. చికిత్సకు స్పందిస్తూ పూర్తిగా కోలుకున్న ఆయన బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి తన నివాసానికి చేరుకున్నారు.
తాను ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో, క్షేమంగా ఉన్నట్లు జేపీ నడ్డా సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఆసుపత్రిలో తనకు అత్యుత్తమ వైద్య సేవలు అందించిన ఎయిమ్స్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స సమయంలో అండగా నిలిచిన శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పారు. నడ్డా త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడటంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నడ్డా ఆరోగ్యంగా ఇంటికి చేరడంతో పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.
ALSO READ: తెలంగాణలో సినిమా టికెట్ రేట్లకు కొత్త రూల్స్.. సూపర్ హైబడ్జెట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్!
