IPL 2026 playoffs: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు క్షణక్షణం ఉత్కంఠ పెంచుతూ వస్తుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ముంబై ఇండియన్స్(MI)పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ విజయంతో కేకేఆర్ ఆశలు సజీవంగా ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి మాత్రం మరింత క్లిష్టమైంది.
ప్రస్తుతం చివరి ప్లేఆఫ్స్ బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్‌కే జట్లు పోటీలో ఉన్నాయి. స్టార్ స్పోర్ట్స్ అంచనాల ప్రకారం రాజస్థాన్‌కు 50 శాతం అవకాశాలు ఉండగా, కేకేఆర్ మరియు పంజాబ్‌కు తలో 19 శాతం అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీకి 9 శాతం మాత్రమే అవకాశాలు ఉండగా, సీఎస్‌కే అవకాశాలు కేవలం 3 శాతానికి పడిపోయాయి.
రాజస్థాన్ తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. పంజాబ్, కేకేఆర్ జట్లు గెలవడంతో పాటు రాజస్థాన్ ఓడిపోవాలని ఎదురుచూడాల్సి ఉంటుంది. ఢిల్లీ పరిస్థితి మరింత కఠినంగా ఉండగా, మిగతా జట్లు అన్నీ ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక సీఎస్‌కే ప్లేఆఫ్స్ చేరాలంటే తమ చివరి మ్యాచ్ గెలవడమే కాకుండా రాజస్థాన్, కేకేఆర్, పంజాబ్, ఢిల్లీ జట్లు కూడా ఓడిపోవాలి. అప్పుడు మాత్రమే నెట్ రన్‌రేట్ ఆధారంగా అవకాశాలు సజీవంగా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు చివరి వరకు ఉత్కంఠగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.








