ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితికి లోబడి ఆదాయం ఉన్నంత మాత్రాన ITR దాఖలు చేయాల్సిన(ITR Filing 2026-27) అవసరం లేదని చాలామంది భావిస్తుంటారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆదాయం తక్కువగా ఉన్నా కూడా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) తప్పనిసరిగా ఫైల్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేస్తోంది. నిబంధనలు పాటించకపోతే నోటీసులు, జరిమానాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.
2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి కొత్త పన్ను విధానంలో సంవత్సరానికి రూ.4 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి సాధారణంగా ITR దాఖలు అవసరం ఉండదు. పాత పన్ను విధానంలో ఈ మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా కొనసాగుతోంది. అయినప్పటికీ కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఈ పరిమితి దాటకపోయినా రిటర్న్ దాఖలు చేయడం తప్పనిసరి అవుతుంది. విదేశాల్లో ఆస్తులు కలిగి ఉండటం, విదేశీ బ్యాంకు ఖాతాల్లో సంతకం అధికారం ఉండటం వంటి సందర్భాల్లో ITR ఫైల్ చేయాలి. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతాల్లో రూ.1 కోటి కంటే ఎక్కువ నగదు జమ చేసినా లేదా సేవింగ్స్ ఖాతాల్లో రూ.50 లక్షలకు పైగా డిపాజిట్లు చేసినా రిటర్న్ దాఖలు తప్పనిసరి అవుతుంది.
విదేశీ ప్రయాణాలపై రూ.2 లక్షలకు మించి ఖర్చు చేసినవారు లేదా విద్యుత్ బిల్లులు రూ.1 లక్షకు మించి చెల్లించినవారు కూడా ITR దాఖలు చేయాల్సి ఉంటుంది. వ్యాపార రంగంలో టర్నోవర్ రూ.60 లక్షలకు మించి ఉంటే లేదా ప్రొఫెషనల్ ఆదాయం రూ.10 లక్షలకు మించి ఉంటే కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. అదేవిధంగా ఆర్థిక సంవత్సరంలో మొత్తం TDS లేదా TCS రూ.25 వేలకుపైగా ఉంటే సాధారణ పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేయాలి. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి రూ.50 వేలుగా ఉంది.
ఈ నిబంధనలు వర్తించినా ITR దాఖలు చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావడంతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ వ్యక్తిగత పరిస్థితులను పరిశీలించి తప్పనిసరిగా రిటర్న్ దాఖలు చేయడం అవసరం. ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026గా నిర్ణయించారు.








