ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉదయం భారత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌లో పర్యటించిన మోడీ అక్కడి ప్రధాని రాబ్ జెట్టెన్‌కు అరుదైన మధుబని పెయింటింగ్(Madhubani painting)ను బహుమతిగా అందించారు. చేప ఆకృతితో రూపొందించిన ఈ పెయింటింగ్ భారతీయ సాంప్రదాయ కళలకు ప్రతీకగా నిలుస్తోంది.
మధుబని కళ భారతదేశంలోని మిథిలా ప్రాంతానికి చెందిన అత్యంత ప్రాచీన జానపద కళారూపంగా గుర్తింపు పొందింది. ఈ కళకు భౌగోళిక గుర్తింపు (GI Tag) కూడా లభించింది. పండుగలు, వివాహాలు, శుభకార్యాల సందర్భంగా ఈ పెయింటింగ్స్‌ను ప్రత్యేకంగా రూపొందిస్తారు.
ఈ చిత్రాల్లో పువ్వులు, పక్షులు, చెట్లు, చేపలు వంటి ప్రకృతి ఆకృతులతో పాటు దేవతలు, పురాణ గాథలు, రోజువారీ జీవనశైలిని ప్రతిబింబించే అంశాలు కనిపిస్తాయి. భారతదేశం, నేపాల్‌లోని మిథిలా ప్రాంతంలో ఈ కళ విస్తృతంగా కనిపిస్తుంది.
నెదర్లాండ్స్ ప్రధానికి ఈ మధుబని పెయింటింగ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల గొప్పతనాన్ని ప్రపంచానికి మరోసారి పరిచయం చేసినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








