LIVE
Sunday, November 15, 2026
LIVE
LIVE

Asian Games 2026 | చైనాపై చారిత్రక విజయం.. 44 ఏళ్ల తర్వాత భారత్‌కు హాకీ గోల్డ్

by Bajaswamy
15 views
Indian women's hockey team celebrates Asian Games 2026 gold after beating China 1-0.

Asian Games 2026: మైదానంలో భారత మహిళల హాకీ జట్టు(Indian women hockey team) రాసిన కథ  44 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఆసియా క్రీడలు-2026లో అదిరిపోయే ఆటతీరుతో భారత వనితలు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను 1-0తో ఓడించి ఆసియా హాకీలో మరోసారి తమ సత్తా చాటారు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచే భారత జట్టు దూకుడు ప్రదర్శించింది. పదో నిమిషంలో లాల్‌రెమ్సియామి కొట్టిన గోల్ భారత్‌కు కీలక ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత చైనా నుంచి ఎదురైన ఒత్తిడిని భారత రక్షణ విభాగం సమర్థంగా అడ్డుకుంది. ముఖ్యంగా గోల్‌కీపర్ సవితా పునియా కీలక సమయంలో పెనాల్టీ స్ట్రోక్‌ను అడ్డుకుని జట్టు ఆధిక్యాన్ని కాపాడారు. చివరి వరకు చైనాకు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా భారత్ 1-0 ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది.

ఈ విజయంతో భారత మహిళల హాకీ జట్టు 1982 తర్వాత తొలిసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించింది. అంటే ఏకంగా 44 ఏళ్ల తర్వాత మళ్లీ గోల్డ్ మెడల్ భారత్‌ ఖాతాలో చేరింది. గతంలో 1998, 2018లో ఫైనల్‌కు చేరినప్పటికీ రజతంతో సరిపెట్టుకున్న భారత జట్టు ఈసారి మాత్రం టైటిల్‌ను అందుకుంది. అంతేకాదు ఈ స్వర్ణంతో భారత మహిళల హాకీ జట్టుకు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొనే అవకాశం లభించింది. ఆసియా క్రీడల హాకీలో స్వర్ణ విజేతలకు LA28కు డైరెక్ట్ బెర్త్ దక్కుతుంది. 44 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు పలికి, పసిడి పతకంతో పాటు ఒలింపిక్ బెర్త్‌ను సాధించిన భారత మహిళల హాకీ జట్టు దేశ క్రీడా చరిత్రలో మరో చిరస్మరణీయ అధ్యాయాన్ని లిఖించింది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More