Hardik Pandya: భారత జట్టుకు కీలక ఆటగాడిగా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, ఇంగ్లాండ్ పర్యటనకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ సీజన్‌లో తలెత్తిన గాయం ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో అతడి రీఎంట్రీ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
జులై ప్రారంభం నుంచి ఇంగ్లాండ్‌లో భారత్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. సుదీర్ఘ విరామం తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరిగి బరిలోకి దిగేందుకు పాండ్య సిద్ధమవుతున్న తరుణంలో తాజా పరిణామం అతడికి ఎదురుదెబ్బగా మారింది. వైద్య బృందం, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అతడి పూర్తి ఫిట్‌నెస్‌పై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పేస్ బౌలింగ్‌తో పాటు మధ్య వరుసలో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న పాండ్య వైట్ బాల్ ఫార్మాట్‌లో భారత జట్టుకు అత్యంత కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
అయితే గత కొంతకాలంగా అతడు తరచూ గాయాలతో బాధపడుతూ మ్యాచ్‌లకు దూరమవుతుండటం జట్టు సమతుల్యతపై ప్రభావం చూపుతోంది. 2023 ప్రపంచకప్ సందర్భంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చీలమండ గాయానికి గురైన తర్వాత పాండ్యకు ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతడి ఫిట్‌నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని భారత సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ సిరీస్ కోసం సెలెక్టర్లు ప్రత్యామ్నాయ ఆటగాడి ఎంపికపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.








