Telangana folk singer: తెలంగాణ జానపద గీతాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాగదుర్గ(Nagadurga) ఇప్పుడు వెండితెరపై కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు తన గాత్రంతో అలరించిన ఆమె, తొలిసారిగా హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో నటుడు ప్రియదర్శి కథానాయకుడిగా కనిపించనుండగా, దర్శకుడు వంశీ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థలు బన్నీ వాసు వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా బన్నీ వాసు, సుకుమార్ వ్యవహరించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఈ నెల 25న నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. నాగదుర్గ హీరోయిన్‌గా ఎంపికైన విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ యాస, సంస్కృతి, కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. గ్రామీణ వాతావరణం, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే కథాంశంతో సినిమా ఉండనుందని సమాచారం.
ఇప్పటికే నాగదుర్గ పాడిన పలు తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్‌లో భారీ ఆదరణ పొందాయి. లక్షలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ పాటలు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఇప్పుడు అదే గుర్తింపు ఆమెకు సినీ రంగంలో హీరోయిన్‌గా అవకాశం తీసుకొచ్చింది. జూలై నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా, ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఫోక్ సంగీత ప్రపంచం నుంచి వెండితెర వరకు నాగదుర్గ చేస్తున్న ఈ ప్రయాణం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.
Telangana folk singer | పాటల నుంచి వెండితెరకు.. హీరోయిన్‌గా తెలంగాణ ఫోక్ సింగర్
-








