Mark Zuckerberg: కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో టెక్ దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికల్లో కంటెంట్ నిర్వహణ, డీప్‌ఫేక్‌లు, ఇతర సాంకేతిక లోపాలపై కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ యువతను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఫేస్‌బుక్ నుంచి తొలగించబడటంతో ఈ అంశం వివాదంగా మారింది. ఆ వీడియో సాంకేతిక కారణాలతో తొలగించబడిందని మెటా వివరణ ఇచ్చినా, దానిపై పార్లమెంటరీ ఐటీ స్థాయీ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
మూడు రోజుల్లో సరైన వివరణ లేదా క్షమాపణ లేకపోతే చట్టపరమైన రక్షణ అంశాన్ని పునఃసమీక్షిస్తామని కమిటీ హెచ్చరించిన నేపథ్యంలో మెటా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్షమాపణ ప్రధాని మోడీకి వ్యక్తిగతంగా కాకుండా, కంటెంట్ నిర్వహణలో జరిగిన లోపాలపై సంస్థ తరఫున వెల్లడించినదిగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSAM), డీప్‌ఫేక్ వీడియోలు, అల్గారిథమ్ నిర్వహణలో తలెత్తిన లోపాలపై కూడా మెటా విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొన్ని రకాల కంటెంట్ ప్రచారానికి ఆర్థిక లావాదేవీలు జరిగిన విషయాన్ని కూడా సమీక్షలో అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి.
అధికార వర్గాల ప్రకారం, మెటా కేవలం తటస్థ మధ్యవర్తి మాత్రమే కాదని, ఏ కంటెంట్‌ను వినియోగదారులకు చూపించాలనే నిర్ణయంలో సంస్థకే కీలక పాత్ర ఉంటుందని పేర్కొంది. దీంతో ఐటీ చట్టంలోని “సేఫ్ హార్బర్” రక్షణపై కూడా చర్చ మరింత వేడెక్కుతోంది.








